మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అప్ డేట్

23-11-2020 Mon 21:44
  • మహేశ్ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
  • బ్యాంకింగ్ వ్యవస్థ లొసుగుల నేపథ్యంలో కథ
  • ముందుగా హైదరాబాదులో షూటింగుకి ప్లాన్
  • షూటింగ్ కోసం ఇక్కడ ప్రత్యేకమైన సెట్స్    
Update on Mahesh babus latest movie

కరోనా కారణంగా ముందుకు కదలకుండా ఆగిపోయిన సినిమాలలో మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' కూడా వుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ వాస్తవానికి ఈపాటికి చాలా వరకు జరిగిపోవాలి. అయితే, లాక్ డౌన్ కారణంగా అడ్డంకి ఏర్పడింది.

కథ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరగాలి. అయితే, కరోనా విస్తృతి నేపథ్యంలో అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడం లేట్ అవుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. జనవరి నుంచి అమెరికాలో షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేశారు.

అయితే, ప్రస్తుతం ఈ ప్లానింగ్ మారినట్టు తెలుస్తోంది. ముందుగా ఇక్కడే కొంత షూటింగ్ నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారట. దీంతో హైదరాబాదులో దీని కోసం ప్రత్యేకమైన సెట్స్ వేయనున్నట్టు సమాచారం. ఇక్కడి షెడ్యూలు ముగిసిన తర్వాత అమెరికా షెడ్యూలు ఉంటుందని అంటున్నారు.

ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులు, మోసాలు.. నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.