వైసీపీ అరాచకాలతో విసిగిన ప్రజలు తిరుపతిలో మమ్మల్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు: సోమిరెడ్డి

23-11-2020 Mon 20:53
  • త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక
  • టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి
  • ఎల్లుండి చంద్రబాబుతో సమావేశమవుతామన్న సోమిరెడ్డి
Somireddy met Panabaka Lakshmi and discussed Tirupati by polls

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పనబాక లక్ష్మితో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. సోమిరెడ్డి తిరుపతి ఉప ఎన్నికపై చర్చించేందుకు పనబాక లక్ష్మి నివాసానికి వెళ్లారు. అక్కడ పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్యతో మాట్లాడారు. దీనిపై సోమిరెడ్డి ట్విట్టర్ లో వెల్లడించారు.

"తిరుపతి ఉప ఎన్నిక అంశంపై ఇవాళ పనబాక లక్ష్మి, కృష్ణయ్య దంపతులతో చర్చించాను. అయితే మొన్న 21వ తేదీన వారి కుమార్తె నిశ్చితార్థం కావడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎల్లుండి పార్టీ అధినేత చంద్రబాబు గారితో సమావేశమవుతాం. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని ప్రచారం ప్రారంభిస్తారు" అని వెల్లడించారు.

రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి గారు ప్రజాసమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన సీనియర్ నాయకురాలు అని సోమిరెడ్డి వివరించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవస్థలన్నీ విఫలమయ్యాయని, అధికార పార్టీ అరాచకాలు, కక్షసాధింపులతో విసిగి వేసారిన ప్రజానీకం టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.