DK Aruna: కేటీఆర్ హైటెక్ షోకేస్ లా తయారయ్యారు: డీకే అరుణ

  • పొత్తు లేదని టీఆర్ఎస్, ఎంఐఎంలు చెప్పుకుంటున్నాయి
  • ఒవైసీ సోదరులను కేసీఆర్ భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు
  • టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమీ లేదు
KTR became like a Hitech Showcase says DK Aruna

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. తమ మధ్య పొత్తు లేదని టీఆర్ఎస్, ఎంఐఎం చెపుతున్నాయని విమర్శించారు. జనాల చెవుల్లో పువ్వులు పెట్టాలని అనుకుంటున్నారని అన్నారు.

ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పే కేసీఆర్... ఎన్నికలు వచ్చే సరికి ఎంఐఎంతో మాకు పొత్తు లేదని అంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన రెండు భుజాలపై ఒవైసీ సోదరులను కూర్చోబెట్టుకున్నారని చెప్పారు. ఓట్ల కోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారని... ముస్లింలనే మోసం చేస్తున్న మోసగాడు కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొప్ప హిందువుగా చెప్పుకునే కేసీఆర్... భైంసాలో హిందువులపై దాడి చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు.

హైదరాబాదుకు కొత్తగా మీరు తీసుకొచ్చింది ఏమీ లేదంటూ కేటీఆర్ ను ఉద్దేశించి అరుణ అన్నారు. అందుకే నగర ప్రజలు బీజేపీకే ఓటు వేయాలనుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమీ లేదని... పాత సీసాలో కొత్త సారా మాదిరి ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలవరని... ఎమ్మెల్యేలు ప్రజలను కలవరని... ఇలాంటి స్థితిలో ప్రజా సమస్యలను పట్టించుకునేది ఎవరని ప్రశ్నించారు. 'మన నగరం, మన పార్టీ, మన పాలన' అనే స్లోగన్ టీఆర్ఎస్ కు సరిపోదని.. 'నా పాలన, నా పార్టీ' అంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అందరి నగరం కావాలని ప్రజలు అనుకుంటున్నారని... అందుకే బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

హైటెక్ మాటలు చెపుతున్న కేటీఆర్... హైటెక్ షోకేస్ లా తయారయ్యారని అరుణ ఎద్దేవా చేశారు. వరద సాయాన్ని బీజేపీ అడ్డుకుందని తండ్రీకొడుకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ రూ. 10 వేలు పంచిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాల్సిందని అన్నారు. వరద బాధితులకు ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని... అందుకే ఇలా చేశారని చెప్పారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి రేపు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.

More Telugu News