హిందువులను చంపేస్తామన్నప్పుడు మీకు మాట్లాడాలనిపించలేదా?: సినీ నటుడు సీవీఎల్

23-11-2020 Mon 19:28
  • డైరెక్టర్ శంకర్ మాటలు సినిమా స్క్రిప్ట్ కు పనికొస్తాయి
  • భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి హిందువులు వెళ్లకూడదనుకుంటున్నారా? 
  • తెలంగాణ సినిమాను చంపేశారు
Actor CVL Narasimha Rao fires on Director Shankar

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ నాయకులకు తోడు సినీ ప్రముఖుల వ్యాఖ్యలు కూడా హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పోసాని కృష్ణమురళి, దర్శకుడు శంకర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నే గెలిపించాలని ప్రజలను కోరారు. మరోవైపు ఈరోజు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో సినీ యాక్టర్లు సీవీఎల్ నరసింహారావు, కవిత, వైభవ్, శ్రీనాథ్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ డైరెక్టర్ శంకర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

శంకర్ మాట్లాడిన మాటలు సినిమా స్క్రిప్ట్ కే పనికొస్తాయని నరసింహారావు చెప్పారు. బీజేపీ అరాచకాలు, అల్లకల్లోలం చేస్తోందని అంటారా? అని మండిపడ్డారు. హిందువులను చంపేస్తాం, ఆవులను చంపేస్తాం అని అన్నప్పుడు మీకు మాట్లాడాలనిపించలేదా? అని నిలదీశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి హిందువులు వెళ్లకూడదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ది ఆగిపోయిందని విమర్శించారు. పరిశ్రమ అభివృద్ధి అంటే మీరు 50 ఎకరాలు తీసుకోవడమేనా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికి చిత్రపురిలో ఇల్లు ఎందుకు ఇప్పించడం లేదని అన్నారు. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలని... చిత్తశుద్ధి లేకపోవడం వల్లే తెలంగాణ సినిమాను చంపేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ శంకర్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.