సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం: చిరంజీవి, నాగార్జున

23-11-2020 Mon 18:12
  • టాలీవుడ్ పై సీఎం కేసీఆర్ వరాల జల్లు
  • ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటుందన్న చిరంజీవి
  • సీఎం కేసీఆర్ కు ఎంతో రుణపడి ఉంటామన్న నాగ్
Chiranjeevi and Nagarjuna thanked CM KCR

కరోనా మహమ్మారి ప్రభావంతో స్తబ్దుగా మారిన సినీ పరిశ్రమకు మళ్లీ ఊపు తెచ్చేలా సీఎం కేసీఆర్ ఊరట చర్యలు ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, నాగార్జున స్పందించారు. సీఎం కేసీఆర్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వేర్వేరు ప్రకటనలు చేశారు.

 సినిమా ఇండస్ట్రీ కోలుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన సహాయక చర్యల పట్ల ధన్యవాదాలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కరోనా ప్రభావంతో కుంగిపోయిన చిత్ర పరిశ్రమను ప్రభుత్వ నిర్ణయాలు కచ్చితంగా పునరుజ్జీవింప చేస్తాయని నమ్ముతున్నామని తెలిపారు. సినీ రంగంపై సీఎం కేసీఆర్ కురిపించిన వరాల జల్లుతో ఇండస్ట్రీ మళ్లీ అభివృద్ధి బాటలో నడుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

అటు, నాగార్జున స్పందిస్తూ, సీఎం కేసీఆర్ కు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. తీవ్ర సంక్షోభ సమయంలో సీఎం కేసీఆర్ స్పందించిన తీరు పట్ల ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. కొవిడ్ ధాటికి చిత్ర పరిశ్రమలో తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ ముఖ్యమంత్రి ప్రకటించిన తోడ్పాటు చర్యల పట్ల చేతులెత్తి నమస్కరిస్తున్నామని వివరించారు.