తమిళంలో రష్మికకు మరో సినిమా!

23-11-2020 Mon 17:41
  • తెలుగులో అగ్రశ్రేణి కథానాయికగా రష్మిక 
  • తమిళంలో కార్తీతో 'సుల్తాన్' చేసిన భామ 
  • తాజాగా సూర్య సరసన నటించే అవకాశం  
Rashmika opposite Surya

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హాట్ కథానాయిక రష్మిక. స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్రశ్రేణి కథానాయికల జాబితాలోకి అనతికాలంలోనే చేరిపోయింది. ప్రస్తుతం తెలుగులో 'పుష్ప', 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమాలలో నటిస్తున్న ఈ కన్నడ భామ అటు తమిళంలో కూడా ఇటీవలే కాలుమోపింది.

కార్తీ హీరోగా బక్కియరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సుల్తాన్' చిత్రం ద్వారా కోలీవుడ్ లో ప్రవేశించింది. ఇటీవలే షూటింగును పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదిలావుంచితే, ఈ సినిమా విడుదల కాకుండానే కార్తీ సోదరుడు సూర్య సరసన నటించే లక్కీ ఛాన్స్ ను ఈ ముద్దుగుమ్మ పొందినట్టు తెలుస్తోంది.

తాజాగా 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న స్టార్ హీరో సూర్య త్వరలో పాండియరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు తాజాగా రష్మికను ఎంచుకున్నట్టు సమాచారం. ఇక కన్నడలో సినిమాలు చేస్తూనే, ఇటు తెలుగు, తమిళ భాషలలో కూడా సినిమాలు కొనసాగించాలన్నది రష్మిక ఆలోచనగా కనిపిస్తోంది.