ఫైవ్ స్టార్ హోటల్లో ఈవెంట్ మేనేజర్ పై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

23-11-2020 Mon 17:07
  • బాధితురాలికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మిక్కీ మెహతా
  • నవంబర్ 19న బాధితురాలిపై అత్యాచారం
  • అనంతరం ఆనంద్ విహార్ ప్రాంతంలో వదిలేసిన వైనం
Mumbai Event Manager Raped At Delhi 5 Star Hotel

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ముంబైకి చెందిన 27 ఏళ్ల మహిళా ఈవెంట్ మేనేజర్ ను రేప్ చేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 21న వారిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు మిక్కీ మెహతా (57), నవీన్ ద్వార్ (46) ఢిల్లీలోని లజపత్ నగర్ మరియు సాకేత్ ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో వీరిద్దరూ ఒక దాబాను నడుపుతున్నారని చెప్పారు.  

బాధితురాలు ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తోంది. పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు... మెహతా అనే వ్యక్తి ఆమెకు ఫేస్ బుక్ ఫ్రెండ్. ఆయనతో పాటు అతని స్నేహితుడు ద్వార్ ను నవంబర్ 18, 19 తేదీల్లో ఆమె కలుసుకుంది. నవంబర్ 19న పనులు ముగించుకుని కన్నాట్ ప్లేస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ కు వారు తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో ఆమెతో ద్వార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత హోటల్ బయట బాధితురాలిని, మెహతాను వదిలేసి వెళ్లిపోయాడు. హోటల్ లోకి వెళ్లిన తర్వాత ఆమెపై మెహతా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆనంద్ విహార్ ప్రాంతంలో ఆమెను వదిలేసి పరారయ్యాడు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఒక నివేదిక ప్రకారం ఢిల్లీలో ప్రతి రోజు ఆరుగురు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. 98 శాతం మంది బాధితులు బంధువుల చేతనో, పరిచయం ఉన్న వ్యక్తుల చేతిలోనే అత్యాచారానికి గురవుతున్నారు.