డబ్ల్యూడబ్ల్యూఈలో ముగిసిన 'అండర్ టేకర్' శకం... రెజ్లింగ్ దిగ్గజానికి వీడ్కోలు పలికిన సహచరులు!

23-11-2020 Mon 14:24
  • గత జూన్ లో రిటైర్మెంట్ ప్రకటించిన అండర్ టేకర్
  • ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అండర్ టేకర్
  • రెజ్లింగ్ లో లెజెండరీ స్థాయి అందుకున్న అమెరికన్ వస్తాదు
WWE fellow wrestlers sendoff to the legendary Undertaker

భారత్ లో శాటిలైట్ చానళ్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్లలో డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ కార్యక్రమం ఇక్కడి ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకర్షించింది. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టయిన్ మెంట్) రెజ్లింగ్ పోటీల్లో అందరి అభిమానానికి పాత్రుడైన వస్తాదు 'అండర్ టేకర్'. ఆయన అసలు పేరు మార్క్ విలియమ్ కలావే. ఈ అమెరికా జాతీయుడి వయసు 55 సంవత్సరాలు. తన అసలు పేరుకంటే నిక్ నేమ్ తోనే ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పొందడం 'అండర్ టేకర్' కే చెల్లింది.

ఓ పిశాచగణ రారాజులా రింగ్ లోకి ప్రవేశించే తీరు, రింగ్ లో ఆయన వీరోచిత పోరాటాలు, అద్భుతమైన అథ్లెటిక్ విన్యాసాలు 'అండర్ టేకర్' కు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ లో ఓ లెజెండ్ స్థాయిని అందించాయి. అలాంటి దిగ్గజం రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు గత జూన్ లో ప్రకటించగా, డబ్ల్యూడబ్ల్యూఈలోని ఆయన సహచరులు తాజాగా ఓ సిరీస్ లో ఘనంగా వీడ్కోలు పలికారు. 'అండర్ టేకర్' సమకాలికులైన ట్రిపుల్ హెచ్, షేన్ మెక్ మహోన్, రకీషీ, షాన్ మైకేల్స్, బిగ్ షో, జేబీఎల్, రిక్ ఫ్లెయిర్, కేన్, మిక్ ఫోలీ తదితరులు అందరూ కలసికట్టుగా వచ్చి ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 'అండర్ టేకర్' మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా ఎంతోమంది ప్రత్యర్థులను చిత్తు చేశానని, ఇక వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసిందని తెలిపారు. ఇక ఈ 'అండర్ టేకర్' ను ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ లో సోనీ స్పోర్ట్స్ చానళ్లలోనూ, ప్రపంచవ్యాప్తంగా ఇతర క్రీడా చానళ్లలోనూ 'అండర్ టేకర్' పై స్పెషల్ ఎపిసోడ్ లు, ఆయనకు నీరాజనాలు పడుతూ ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.