Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషికి పెరోల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

  • పెరారివాలన్ కు వారం రోజుల పెరోల్ 
  • ఆసుపత్రికి వెళ్లేందుకు పెరోల్ మంజూరు
  • భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు
Rajiv Gandhi Assassination Convict AG Perarivalan Gets Weeks Parole

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన పెరారివాలన్ కు సుప్రీంకోర్టు వారం రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం పెరోల్ ను ఇచ్చింది. పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లే సమయంలో పెరారివాలన్ కు పూర్తి భద్రత కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 23 వరకు ఆయనకు మద్రాస్ హైకోర్టు పెరోల్ మంజూరు చేసింది. ఈ పెరోల్ ను సుప్రీంకోర్టు మరో వారం పాటు పొడిగించింది.

పెరారివాలన్ కు పెరోల్ ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో, ఆయన పెరోల్ ను సుప్రీం పొడిగించింది. మరోవైపు ఈ హత్య కేసులో దోషులైన ఏడుగురిని విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసు ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. రానున్న జనవరిలో వీరి విడుదలపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ అంశానికి సంబంధించి తమిళనాడు గవర్నర్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది.

వీరి విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ ఈ నెల ప్రారంభంలో తమిళనాడులోని విపక్ష పార్టీలైన డీఎంకే, పీఎంకే లు రాష్ట్ర గవర్నర్ ను కోరాయి. రెండేళ్లుగా ప్రభుత్వ సిఫారసు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఇంత వరకు ఆయన ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏడుగురు దోషులు గత 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు.

More Telugu News