Narendra Modi: వ్యాక్సిన్ పై వ్యూహం కోసం... రేపు సీఎంలతో మోదీ సమావేశం!

  • వర్చ్యువల్ విధానంలో సమావేశం
  • తొలి దశలో కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలతో సమావేశం
  • కరోనా నియంత్రణ చర్యలపై చర్చించనున్న మోదీ
CM to Talk with CMs over Corona Tomonrrow

ఇండియాలో ప్రస్తుతమున్న కరోనా తీవ్రతపైన, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, స్టోరేజ్ సామర్థ్యం, పంపిణీ వ్యూహంపైనా మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వర్చ్యువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో సీఎంల అభిప్రాయాలను మోదీ తెలుసుకోనున్నారని సమాచారం.

కొవిడ్-19 కేసులు అత్యధికంగా ఉన్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తొలి భేటీ జరుగుతుందని, ఆపై రెండో దశలో మిగతా రాష్ట్రాలతో మోదీ చర్చిస్తారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపైనా ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.

కాగా, ఇప్పటికే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్న ప్రధాని కార్యాలయం, అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ ను ప్రకటిస్తుందని సమాచారం. ఈ టాస్క్ ఫోర్స్ వ్యాక్సిన్ల ధర, కొనుగోలు, స్టోరేజ్, పంపిణీ, ఇతర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై నియమావళిని రూపొందిస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇదిలావుండగా, ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ను వాడేందుకు బ్రిటన్ అనుమతిస్తే, ఆ వెంటనే ఇండియాలో సైతం అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ వెల్లడించడం గమనార్హం. మరోవైపు కోవిషీల్డ్ ఎమర్జెన్సీ వినియోగానికి డిసెంబర్ లో దరఖాస్తు చేసుకోనున్నామని సీరమ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News