తరుణ్ తల్లి మాటలు విని దిగ్భ్రాంతికి గురయ్యాను: ప్రియమణి

22-11-2020 Sun 22:10
  • తరుణ్ తో నవ వసంతం చిత్రంలో నటించిన ప్రియమణి
  • తరుణ్ తో లంచ్ లు, డిన్నర్లకు వెళ్లానని వెల్లడి
  • తరుణ్ తల్లి ప్రేమ అనుకున్నారని వివరణ
Priyamani tells about her friendship with Tarun

తనదైన నటన, అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. గతంలో ప్రియమణి హీరో తరుణ్ తో కలిసి 'నవ వసంతం' అనే చిత్రంలో నటించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య బాగా స్నేహం ఏర్పడిందట. తామిద్దరం లంచ్ లు, డిన్నర్లకు కూడా వెళ్లేవారమని, దాంతో ప్రజలు తమను ప్రేమజంటగా భావించారని ప్రియమణి వెల్లడించింది. తరుణ్ ఎంతో సరదాగా ఉంటాడని, అందుకే అతనితో తాను సన్నిహితంగా మెలిగానని వివరించింది. అయితే, తమ ఫ్రెండ్షిప్ చూసి తరుణ్ తల్లి రోజారమణి ప్రేమ అనుకున్నారని ప్రియమణి తెలిపింది.

"ఓ రోజు సెట్స్ పైకి రోజారమణి కూడా వచ్చారు. ఆమె నా వద్దకు వచ్చి... మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. ఇష్టమైతే తరుణ్ ను పెళ్లిచేసుకోవచ్చు అని చెప్పారు. దాంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. వెంటనే తేరుకుని, తరుణ్ తో ఉన్నది కేవలం స్నేహమేనని, మీరు పొరబడ్డారని చెప్పాను" అంటూ నాటి సంగతులు పంచుకుంది. కాగా, ప్రియమణి మూడేళ్ల కిందట వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ ను పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది.