టీమిండియాలో స్థానం దక్కకపోవడంపై ముంబయి ఆటగాడి ఆవేదన

22-11-2020 Sun 21:50
  • ఇటీవల బాగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్
  • ఐపీఎల్ లోనూ మెరుపులు
  • మొండిచేయి చూపిన సెలెక్టర్లు
  • ఆసీస్ పర్యటనకు ఎంపిక చేయని వైనం
Surya Kumar Yadav talks to media his non selection into Teamindia

ఇటీవల భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సూర్యకుమార్ యాదవ్. దేశవాళీ క్రికెట్లోనే కాదు, ఐపీఎల్ లోనూ సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటాడు. దాంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో సూర్యకుమార్ కు తప్పకుండా చోటు లభిస్తుందని అందరూ భావించారు. కానీ, సెలెక్టర్లు అనూహ్యంగా అతడికి మొండిచేయి చూపారు. దాంతో ఈ ముంబయి ఆటగాడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, ఆసీస్ టూర్ కు జట్టును ప్రకటిస్తారని తెలియడంతో ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యానని తెలిపాడు. దాంతో ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు జిమ్ లో గడిపానని వెల్లడించాడు. "జట్టు సభ్యులతో మాట్లాడుతూ టెన్షన్ తగ్గించుకునేందుకు ప్రయత్నించాను. కానీ ఎంపిక విషయమే మదిలో మెదులుతోంది. ఇంతలోనే ఆస్ట్రేలియా వెళ్లే టీమిండియాను ప్రకటించారు. అందులో నా పేరు లేకపోవడంతో నా రూమ్ కు వెళ్లిపోయాను. నా పేరు ఎందుకు లేదని ఆలోచించాను.

అయితే, నా బాధను అర్థం చేసుకున్నది రోహిత్ శర్మే. సరైన సమయంలో జట్టులో అవకాశం వస్తుందని ఊరడించాడు. ఆత్మవిశ్వాసంతో ఆడుతూ పోతే అది ఇవాళ కావొచ్చు, లేక రేపు కావొచ్చు.. తప్పకుండా జట్టులో స్థానం లభిస్తుందని ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాడు. దాంతో నా మనసు తేలికైంది. నా కళ్లలోని బాధ రోహిత్ కు అర్థమైందని కచ్చితంగా చెప్పగలను" అని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు.