బీజేపీ నేతలను నిద్రలేపి అడిగితే వాళ్లు చెప్పే పేర్లలో నా పేరు కచ్చితంగా ఉంటుంది: ఒవైసీ

22-11-2020 Sun 14:58
  • త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు
  • వరద బాధితులకు మోదీ సర్కారు ఏమీచేయలేదన్న ఒవైసీ
  • మతం పేరుతో ఓట్లకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు
Owaisi criticizes BJP leaders ahead of GHMC elections

గ్రేటర్ ఎన్నికల సమరాంగణంలో తమ పట్టు నిరూపించుకునేందుకు ఎంఐఎం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ నేతలను నిద్రలేపి కొన్ని పేర్లు చెప్పమంటే వాళ్లు చెప్పే పేర్లలో తన పేరు తప్పకుండా ఉంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఒవైసీ అనే పేరు మాత్రమే కాకుండా ఉగ్రవాదం, ద్రోహం, పాకిస్థాన్ అనే పేర్లను కూడా బీజేపీ నేతలు ఎక్కువగా పలుకుతుంటారని వ్యాఖ్యానించారు.

ఇటీవలి వరదలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైందని, వరదలతో తల్లడిల్లిపోయిన నగర ప్రజలకు మోదీ సర్కారు చేసిందేమీ లేదని అన్నారు. హైదరాబాదుకు బీజేపీ ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు మతం పేరుతో ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎత్తులు ఇక్కడ పనిచేయవని, నగర ప్రజలకు ఎవరు ఎలాంటివారో తెలుసని ఒవైసీ స్పష్టం చేశారు. అసలు, బీజేపీ నేతలు హైదరాబాదుకు ఏంచేశారో చెప్పాలని నిలదీశారు.