బెంగళూరు కన్నా హైదరాబాద్‌ ఎక్కడ వెనకపడిందో అంచనా వేసుకుంటున్నాం: కేటీఆర్

22-11-2020 Sun 12:36
  • ఐదేళ్లలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి
  • ఐటీ అభివృద్ధికి మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు అవసరం
  • ప్రపంచంలోని టాప్-5 సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి
  • హైదరాబాద్ ప్రపంచంలోనే సురక్షితమైన ఓ నగరం
ktr about investment in hyderabad

ఐటీ రంగంలో బెంగళూరు కంటే హైదరాబాద్ ఎక్కడ వెనుకబడిందో పరిశీలించుకుంటున్నామని, ఓ అంచనా వేసుకుంటున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. హెచ్‌ఐసీసీలో బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ టెకీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణలో ఐదేళ్లలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని కేటీఆర్ చెప్పారు. ఐటీ అభివృద్ధికి మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు, లాజిస్టిక్స్ అవసరమని తెలిపారు. అవన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలోని టాప్-5 సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను తమ రెండో చిరునామాగా ప్రకటించాయని చెప్పారు.

ప్రపంచంలో హైదరాబాద్ సురక్షితమైన ఓ నగరంగా ఉందని కేటీఆర్ తెలిపారు. భౌగోళికంగా కూడా హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, అందుకే పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో అమెజాన్ వంటి సంస్థలు తమ కార్యాలయాలను స్థాపించాయని చెప్పారు. పెట్టుబడులకు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ తెలంగాణ ముందు వరసలో ఉందని కేటీఆర్ అన్నారు. 2014 కు ముందు తెలంగాణలో అనేక సమస్యలుండేవని చెప్పారు.