దుబ్బాక ప్రజలు మార్పునకు తొలి అడుగు వేశారు.. హైదరాబాదీలూ కొనసాగించాలి: కిషన్ రెడ్డి

22-11-2020 Sun 13:38
  • ఉన్న స్పోర్ట్ కాంప్లెక్స్‌ల అభివృద్ధికే దిక్కులేదు
  • కొత్తవి నిర్మిస్తామని కేసీఆర్ చెబుతున్నారు
  • తెలంగాణలో అవినీతి
  • సర్కారు దుబారా ఖర్చు చేస్తోంది
kishan reddy fire on trs

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతోన్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఉన్న స్పోర్ట్ కాంప్లెక్స్‌ల అభివృద్ధికే దిక్కులేదు కానీ కొత్తవి నిర్మిస్తామని ఆయన చెబుతున్నారని అన్నారు.

హైదరాబాద్ నగరానికి రెండు వైద్యకాలేజీలు వచ్చాయని కిషన్ రెడ్డి చెప్పారు. దుబ్బాక ప్రజలు మార్పునకు తొలి అడుగు వేశారని తెలిపారు. ఆ మార్పును ముందుకు తీసుకెళ్లాలని హైదరాబాద్ ప్రజలను కోరుతున్నానని అన్నారు. భూకబ్జాలు, వర్షాలకు ఇళ్లు మునిగిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి తెలంగాణను ప్రజలు కోరుకోలేదని చెప్పారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ను పాటించట్లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తాను హైదరాబాద్‌కు కేంద్ర సర్కారు నుంచి నిధులు మంజూరు చేయించానని అన్నారు. తెలంగాణలో అవినీతి కారణంగా రెవెన్యూ తగ్గుతోందని ఆరోపించారు.
 
తెలంగాణ సర్కారు దుబారా ఖర్చు చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. అవినీతి, దుబారా ఖర్చులను తగ్గించితే అభివ‌ృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అలాగైతేనే కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు వస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా బీజేపీ గెలిస్తే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, హైదరాబాద్ కాకుండా స్మార్ట్ సిటీగా కరీంనగర్ ని చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు. తాము వరంగల్ కు కూడా స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చామని, వాటిని సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు. ఐదేళ్లయినా రెండు పడకగదుల ఇళ్లను కూడా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడం లేదని తెలిపారు.