వ్యాక్సిన్ ట్రయల్స్ లో ప్రతికూల ఘటన నిజమే... అంగీకరించిన భారత్ బయోటెక్!

22-11-2020 Sun 09:51
  • కోవాగ్జిన్ పేరిట కరోనా టీకా
  • తొలి దశ ట్రయల్స్ లో ప్రతికూల ఘటన
  • అది టీకా వల్ల కాదన్న భారత్ బయోటెక్
Adverce incident Already Reported says Bharath Biotech

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, కోవాగ్జిన్ పేరిట కరోనా టీకాను తయారు చేసి, ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్, తన ట్రయల్స్ లో ప్రతికూల ఘటన ఒకటి జరిగిన విషయం వాస్తవమేనని పేర్కొంది. అయితే, ఈ ఘటన గురించి 24 గంటల్లోనే రిపోర్ట్ చేశామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ బయోటెక్ తొలి దశ టీకా ట్రయల్స్ లో జరిగిన ప్రతికూల ఘటన గురించి సంస్థ రిపోర్ట్ చేయలేదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన భారత్ బయోటెక్, "ఆగస్టులో జరిగిన ఈ ఘటన గురించి సీడీఎస్సీఓ - డీజీసీఐకి 24 గంటల వ్యవధిలోనే రిపోర్ట్ ఇచ్చాము.అయితే ఇది వ్యాక్సిన్ కారణంగా జరుగలేదు" అని స్పష్టం చేసింది. ఈ టీకాను భారత్ బయోటెక్ తో పాటు ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్ కు ఇప్పటికే అనుమతులు లభించాయి.