కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు.. డిజిటల్ విధానంలోనే జరపాలని ప్రతిపాదన

22-11-2020 Sun 09:00
  • మంగళవారం భేటీ కానున్న పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ
  • ఏఐసీసీ ప్రతినిధుల జాబితాను తెప్పించుకున్న సీఈఏ
  • రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టాలని డిమాండ్
Congress president elections held soon

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తిరిగి రాహుల్ గాంధీ చేపట్టాలన్న డిమాండ్ పార్టీలో చాలాకాలంగా వినిపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత కరోనా కాలంలో ఎన్నికలను డిజిటల్ విధానంలో నిర్వహించాలని నాయకులు ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల సంస్థ (సీఈఏ) మంగళవారం భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఆ రోజు భేటీలో ఏఐసీసీ సభ్యులందరికీ డిజిటల్ కార్డుల జారీ అంశంపై చర్చించనున్నారు.

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఏఐసీసీ ప్రతినిధుల జాబితాను తెప్పించిన సీఈఏ.. డిజిటల్ ఫొటోలను పంపాలని సూచించింది. డిజిటల్ ఎన్నికలు నిర్వహించాలని కనుక నిర్ణయం తీసుకుంటే దానిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇస్తే డిజిటల్ పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అధ్యక్ష పదవిలోకి ఎవరైనా బరిలోకి దిగితే పోలింగ్ నిర్వహించేందుకు సీఈఏ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు, పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ రాహులే చేపట్టాలన్న డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది.