TRS: మా నేతలను కొనేందుకే భూపేంద్రయాదవ్ తెలంగాణకు వచ్చారా?: బీజేపీపై ఉత్తమ్ ఫైర్

Uttam Kumar Reddy alleged that bjp and mim both are Theological parties
  • బీజేపీ, ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం
  • డబ్బు సంచులతో బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్తున్నారు
  • టీఆర్ఎస్ ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోంది
  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఉత్తమ్
అధికార టీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలకు పాతర వేస్తుంటే, బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, డబ్బుల సంచులతో కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి కొనుగోళ్లకు తెరతీసిందని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసేందుకే బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ భూపేంద్రయాదవ్ తెలంగాణకు వచ్చారా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆస్తులను టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటోందని ఉత్తమ్ ఆరోపించారు. మెట్రో రైలు పిల్లర్లపైన, ఆర్టీసీ ఆస్తులపైన ఆ పార్టీ ప్రకటనలు ఉంటున్నాయని అన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన బాత్రూములపైనా ప్రభుత్వ ప్రకటనలు ఉంటున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథికి ఉత్తమ్ వినతిపత్రం సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఎంఐఎం రెండూ మతతత్వ పార్టీలేనని, ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని అన్నారు. బీహార్‌లో ఎంఐఎం పోటీ చేయడం వెనక ఈ ఒప్పందమే ఉందన్నారు. ఒవైసీ సోదరులు అమిత్‌షాను కలిసినట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారని గుర్తు చేశారు. అవినీతి, అసమర్థ పార్టీ టీఆర్ఎస్, మతతత్వ పార్టీలు ఎంఐఎం, బీజేపీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
TRS
Congress
Uttam Kumar Reddy
BJP
MIM

More Telugu News