Visakhapatnam District: విశాఖలో మరో అక్రమ నిర్మాణం కూల్చివేత.. బీచ్‌రోడ్డులోని గోకార్టింగ్ ఎరీనా నేలమట్టం!

  • నాలుగున్నర ఎకరాల్లోని నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు
  • కూల్చివేతల వల్ల రూ. 3 కోట్లు నష్టపోయామన్న నిర్వాహకులు
  • మాజీ మంత్రి గంటా సన్నిహితుడి కుమారుడిదే ‘గోకార్టింగ్ ఎరీనా’
GVMC Officials demolish Go Karting Arena

విశాఖపట్టణంలో కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన జీవీఎంసీ ఇటీవల కూల్చివేతలు మొదలుపెట్టింది. తాజాగా, భీమిలి బీచ్ రోడ్డులోని గోకార్టింగ్ ఎరీనాను నిన్న కూల్చివేసింది. జీవీఎంసీ డిప్యూటీ ప్రణాళికాధికారి రాంబాబు ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకే గోకార్టింగ్ ఎరీనాకు చేరుకున్న అధికారులు, సిబ్బంది జేసీబీతో తొలగింపు ప్రక్రియను చేపట్టారు.  మొత్తం నాలుగున్నర ఎకరాల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేత సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, గోకార్టింగ్ ఎరీనాను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు కాశీవిశ్వనాథ్ తనయుడు ప్రమోద్ కుమార్‌ నిర్వహిస్తున్నారు.

గోకార్టింగ్ ఎరీనా కూల్చివేతపై జీవీఎంసీ ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి ఆర్‌జే విద్యుల్లత మాట్లాడుతూ.. గోకార్టింగ్ నిర్వాహకుల వద్ద 4.48 ఎకరాలకు మాత్రమే పత్రాలు ఉన్నాయని, కానీ 5.05 ఎకరాల్లో దానిని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎక్కువగా ఉన్న మిగతా అర ఎకరాన్ని గుర్తించామని, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలు పాటించనందుకు గాను ఇటీవల నోటీసులు జారీ చేశామని, తాజాగా కూల్చివేసినట్టు చెప్పారు.

కాగా, గోకార్టింగ్  ఎరీనా కూల్చివేతపై దాని యజమాని బి.ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ, దానిని 2013లోనే ప్రారంభించినట్టు చెప్పారు. విశాఖ ప్రొఫైల్స్ సంస్థ నుంచి ఈ భూమిని పదేళ్ల లీజుకు తీసుకున్నట్టు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ ఇండియా అనుమతులతోనే దీనిని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చేపట్టిన కూల్చివేతల వల్ల తమకు 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News