డ్రగ్స్ కేసులో కామెడీ నటి భారతీ సింగ్ అరెస్ట్!

22-11-2020 Sun 07:35
  • ముంబైలో నివాసం ఉంటున్న భారతీ, హర్ష దంపతులు
  • ఇంట్లో సోదాలు జరపగా, పట్టుబడ్డ మాదకద్రవ్యాలు
  • విచారించిన తరువాత అరెస్ట్ చేశామన్న ఎన్సీబీ
Commedian Bharathi Arrested by Mumbai NCB

బాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో కామెడీ నటి భారతీ సింగ్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం వారి ఇంట్లో సోదాలు జరిపినప్పుడు స్వల్ప మొత్తంలో మాదకద్రవ్యాలు లభించాయి. ఆపై భారతిని, ఆమె భర్త హర్ష్ లింబాచియాను తమ కార్యాలయానికి తరలించి, ప్రశ్నించిన అధికారులు, అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. అంధేరిలోని ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఈ జంట నివాసం ఉంటోంది.

ఇక్కడ కనిపించిన దృశ్యాల ప్రకారం, భారతి ఎరుపు రంగు మెర్సిడిస్ బెంజ్ కారులో నార్కోటిక్స్ కార్యాలయానికి వెళ్లగా, లింబాచియాను ఎన్సీబీ అధికారులు, తమ వ్యాన్ లో తీసుకెళ్లారు. ఎన్సీబీ కార్యాలయంలోకి వారిని తీసుకెళ్లే ముందు, వారిని ప్రశ్నించేందుకే పిలిచామని వెల్లడించిన అధికారులు, విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, వాడకంలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందని విచారణ అధికారి సమీర్ వాంఖడే మీడియాకు వెల్లడించారు.

ఓ డ్రగ్ పెడ్లర్ ను విచారిస్తుండగా, భారతీ సింగ్ పేరు బయటకు వచ్చిందని, ఆ తరువాత వారి ఇంట్లో సోదాలు జరిపామని మరో ఎన్సీబీ అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ముంబైలోని మరో రెండు ప్రాంతాల్లోనూ తమ బృందాలు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయని ఆయన తెలిపారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత, బాలీవుడ్ లో డ్రగ్స్ కుంభకోణం వెలుగులోకి రాగా, సినీ పరిశ్రమకు చెందిన పలువురిని అధికారులు ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే.