ప్రకాశం జిల్లాలో టీడీపీ మద్దతుదారులపై దుండగుల హత్యాయత్నం

22-11-2020 Sun 07:22
  • కాపుకాసి మరీ దాడి
  • బాధితుల్లో ఒకరి భార్య టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి
  • వైసీపీ పనేనన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
miscreants attack TDP workers in Prakasam dist

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరొకరు తప్పించుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కుందుర్రు గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులు బి.కృష్ణయ్య, జి.వీరాస్వామి, మరొకరు కలిసి కొమ్మాలపాడు నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో గ్రామానికే చెందిన కొందరు మామిళ్లపల్లి కాలువ వద్ద మాటేసి, వారు రాగానే మారణాయుధాలతో దాడిచేసి చావబాదారు. ఈ దాడిలో కృష్ణయ్య, వీరాస్వామి తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి మాత్రం వారి నుంచి తప్పించుకున్నాడు. దాడి జరుగుతున్న సమయంలో అటువైపుగా కొందరు రావడంతో నిందితులు పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు కృష్ణయ్య భార్య రాఘవమ్మ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులే ఈ దాడికి తెగబడి ఉంటారని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన దాడులకు భయపడేది లేదన్నారు.