పరువునష్టం ఆరోపణలు వెనక్కి తీసుకోవాలంటూ అక్షయ్ కుమార్ కు నోటీసులు పంపిన యూట్యూబర్

21-11-2020 Sat 21:23
  • సుశాంత్ రాజ్ పుత్ పై  యూట్యూబ్ లో వీడియోలు
  • తన పరువుకు భంగం కలిగించారన్న అక్షయ్ కుమార్
  • రూ.500 కోట్లు చెల్లించాలని పరువునష్టం దావా
  • అక్షయ్ ఆరోపణలు నిరాధారమన్న యూట్యూబర్
Youtuber Rashid Siddikqi send legal notices to hero Akshay Kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవల రషీద్ సిద్ధిఖీ అనే యూట్యూబర్ పై రూ.500 కోట్లకు పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో యూట్యూబర్ రషీద్ తనపై నిరాధార ఆరోపణలు చేశాడని, తప్పుడు ప్రచారంతో తన పరువుకు భంగం కలిగించాడని అక్షయ్ ఆరోపిస్తూ పరువునష్టం నోటీసులు పంపాడు. దీనికి యూట్యూబర్ రషీద్ సిద్ధిఖీ దీటుగా స్పందించాడు.

అక్షయ్ కుమార్ తన పరువునష్టం ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా అక్షయ్ కుమార్ కు నోటీసులు పంపాడు. హీరో అక్షయ్ కుమార్ తన గురించి, తన యూట్యూబ్ చానల్ ఎఫ్ఎఫ్ న్యూస్ గురించి చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని రషీద్ స్పష్టం చేశాడు. తనను ఎదగనివ్వకుండా చేసేందుకే నోటీసులు పంపారని ఆరోపించాడు.

ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుందని, రషీద్ సిద్ధిఖీ యూట్యూబ్ వీడియోల్లో అభ్యంతరకర విషయాలు లేవని అతడి తరఫు న్యాయవాది నోటీసుల్లో వివరించారు.