తిరుమల కొండపై హైదరాబాద్ భక్తుడి ఆత్మహత్య

21-11-2020 Sat 21:02
  • తిరుమల వచ్చిన శ్రీధర్ అనే వ్యక్తి
  • వకుళమాత వసతి సముదాయంలో బస
  • ఉరేసుకుని బలవన్మరణం
Hyderabad man commits suicide in Tirumala shrine

హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి తిరుమలలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 40 ఏళ్ల శ్రీధర్ మల్కాజిగిరి వాసి. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీధర్ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం నిన్న తిరుమల వచ్చాడు. స్థానికంగా వకుళమాత వసతి సముదాయంలోని  511 నెంబరు గదిలో బస చేశాడు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అతడి నుంచి స్పందన రాలేదు.

మరోవైపు, శ్రీధర్ గది ఖాళీ చేయాల్సిన గడువు ముగియడంతో టీటీడీ సిబ్బంది తలుపు కొట్టినా లోపలి నుంచి ఎలాంటి జవాబు రాలేదు. దాంతో బలవంతంగా తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా శ్రీధర్ ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. అప్పటికే అతడు మృతి చెందినట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.