కరోనా బారిన పడిన లేడీ డాక్టర్... కోమానుంచి బయటపడేసరికి ఇద్దరు కవలలకు తల్లయింది!

21-11-2020 Sat 19:30
  • బ్రిటన్ లో ఘటన
  • కరోనాతో ఆసుపత్రిపాలైన డాక్టర్ పర్పెచ్యువల్ ఉకే
  • గర్భంతో ఉండడంతో కోమాలోకి పంపిన డాక్టర్లు
  • కోమాలో ఉండగానే సిజేరియన్
Lady doctor who was induced into coma delivered twins

బ్రిటన్ లో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు. బర్మింగ్ హామ్ కు చెందిన పర్పెచ్యువల్ ఉకే అనే లేడీ డాక్టర్ కు కూడా కరోనా సోకింది. గత మార్చిలో ఆమెకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఉకే అప్పటికే గర్భవతి. ఆమె పరిస్థితి రీత్యా ఆసుపత్రి వైద్యులు ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. వైద్యవిధానాల ప్రకారం ఆమెను కోమాలోకి పంపారు.

ఇక, అసలు విషయం ఏంటంటే... డాక్టర్ పర్పెచ్యువల్ ఉకే ఇటీవలే కోమా నుంచి కళ్లు తెరిచారు. అయితే ఎత్తుగా ఉండాల్సిన తన పొట్ట మామూలుగా ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. తీరా చూస్తే ఇద్దరు కవల పిల్లలు దర్శనమిచ్చారు.

ఉకే కరోనాతో బాధపడుతుండడంతో శిశువులు గర్భంలోనే ఉంటే సమస్యలు వస్తాయని భావించిన వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కవలలను భూమ్మీదకు తెచ్చారు. ఆ కవలల్లో ఒకరు ఆడ శిశువు కాగా, మరకొరు మగ శిశువు. వారికి సోచికా పామర్, ఒసినాచి పాస్కల్ అని నామకరణం చేశారు.

కోమాలోంచి బయటికి వచ్చి తన పిల్లలను చూసుకున్న డాక్టర్ ఉకే నమ్మలేకపోయింది. వాళ్లు తన పిల్లలంటే నమ్మశక్యం కాలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి కష్టం వస్తుందని తాను భావించలేదని పేర్కొన్నారు. కాగా, సిజేరియన్ తర్వాత కూడా డాక్టర్ ఉకే 16 రోజుల పాటు కోమాలో ఉన్నారు.