విడాకులకు దరఖాస్తు చేసిన ఐఏఎస్ టాపర్లు

21-11-2020 Sat 18:56
  • 2015 సివిల్స్ పరీక్షల్లో టాపర్లు టీనా డాబీ, అథర్ అమీర్
  • ట్రైనింగ్ లో ప్రేమించుకుని పెళ్లాడిన ఐఏఎస్ జంట
  • కలిసి జీవించలేమని విడాకులకు దరఖాస్తు
IAS topper couple applied for divorce

టీనా డాబీ, అథర్ అమీర్ ఖాన్... ఈ పేర్లు గుర్తుండే ఉంటాయి. 2015 సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో టీనా డాబీ టాపర్, అదే ఏడాది అథర్ అమీర్ ఖాన్  ఆలిండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. మధ్యప్రదేశ్ కి చెందిన టీనా సివిల్స్ లో మొదటి ర్యాంకు సాధించిన తొలి దళిత మహిళగా రికార్డులకెక్కారు. ఇక అథర్ అమీర్ ఖాన్ జమ్మూకశ్మీర్ కు చెందిన వారు.

వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు. ఐఏఎస్ శిక్షణ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టు-1లో డైవోర్స్ కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరం కలిసి జీవించలేమని... తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ లో కోరారు.

మరోవైపు టీనా డాబీ సోషల్ మీడియాలోని తన ఖాతాలో తన పేరు వెనుక పెట్టుకున్న ఖాన్ ను తొలగించారు. అథర్ ఖాన్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి టీనాను అన్ ఫాలో చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా టీనా పని చేస్తున్నారు. అథర్ అమీర్ ఈజీఎస్ సీఈవోగా పని చేస్తున్నారు.