Pawan Kalyan: 'పక్క రాష్ట్రంలో పనికి రాని వ్యక్తి' అంటూ పవన్ కల్యాణ్ పై బాల్క సుమన్‌ తీవ్ర వ్యాఖ్యలు

  • రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదు
  • హైదరాబాద్ రాజకీయాలతో ఏం పని?
  • బండి సంజయ్ హోదాకు తగ్గట్టు వ్యవహరించాలి
Balka Suman targets Pawan Kalyan for supporting BJP

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తమ శక్తియుక్తులన్నింటినీ ధారపోస్తున్నాయి. బల్దియాపై తమ పార్టీ జెండా ఎగరాలనే లక్ష్యంతో చెమటోడుస్తున్నాయి. ఇదే సమయంలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వపన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పక్క రాష్ట్రంలో దేనికీ పనికి రాని వ్యక్తికి హైదరాబాద్ రాజకీయాలతో ఏం పనో అని బాల్క సుమన్ సెటైర్ వేశారు. ఏపీలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ ఒక్క చోట కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదని అన్నారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు హైదరాబాదులో ప్రచారం చేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ఈ రాజకీయాలు ఏంటో వారికే తెలియాలని అన్నారు.

గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా డిగ్రీ పూర్తి చేసిన వారేనని బాల్క సుమన్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... ఆయన హోదాకు తగ్గట్టు వ్యవహరించాలని అన్నారు. బీజేపీ పాలిస్తున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ వ్యక్తిగత విమర్శలు చేస్తోందని... అవి మానేసి దమ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాలని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు.

More Telugu News