బాలకృష్ణ సినిమాలో కథానాయికగా ప్రగ్య జైస్వాల్ ఎంపిక

21-11-2020 Sat 10:53
  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో సినిమా 
  • తప్పుకున్న ప్రయాగ మార్టిన్, సాయేషా సైగల్
  • నేటి నుంచి రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్
  • జాయిన్ అవుతున్న బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్  
Pragya Jaiswal opposite Balakrishna

బాలకృష్ణ సినిమాలో కథానాయిక మళ్లీ మారింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడవ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయికలకు స్థానం వుంది. వీరిలో ఒకరిగా మలయాళ భామ పూర్ణను ఇప్పటికే ఎంపిక చేయడం.. ఆమె షూటింగులో పాల్గొనడం కూడా జరిగింది. ఇక మరో నాయిక విషయంలోనే ఇన్నాళ్లూ కాస్త అనిశ్చితి నెలకొంది.


మొదట్లో ఈ పాత్రకు మలయాళ భామ ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. అంతలోనే ఆమె బాలయ్య సరసన సరిపోవడం లేదంటూ, డ్రాప్ అయ్యారు. తర్వాత సాయేషా సైగల్ ను ఎంపిక చేసినట్టు వినిపించింది. ఇప్పుడు ఆమె కూడా తప్పుకున్నట్టు, దీంతో తాజాగా 'కంచె' ఫేమ్ ప్రగ్య జైస్వాల్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరోపక్క, నేడు ఈ చిత్రం షూటింగులో బాలకృష్ణ జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు ప్రగ్య జైస్వాల్ కూడా షూట్ లో పాల్గొంటుందని సమాచారం. రామోజీ ఫిలిం సిటీలో నేటి నుంచి భారీ షెడ్యూల్ ను నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.