వినియోగానికి రెడీ అవుతున్న ‘ఫైజర్’ కోవిడ్ వ్యాక్సిన్!

21-11-2020 Sat 10:22
  • తుది దశ ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు 
  • అత్యవసర వినియోగానికి దరఖాస్తు
  • డిసెంబరులో యూఎస్ఎఫ్డీఏ సలహా కమిటీ సమీక్ష
pfizer vaccine ready to use

అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు రాబట్టడంతో అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ ఆ సంస్థల ప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని డిసెంబరులో యూఎస్ఎఫ్డీఏ సలహా కమిటీ సమీక్షించనున్నట్లు సమాచారం.

మూడో దశ క్లినికల్ పరీక్షల్లోనూ 95 శాతం ఫలితాలను సాధించినట్లు ఇటీవలే ఫైజర్ ప్రకటన చేసింది. ఈ వ్యాక్సిన్ ను అమెరికాతో పాటు బెల్జియంలలో వినియోగానికి ఈ ఏడాది చివరికల్లా ఐదు కోట్ల డోసేజీలను ఉత్పత్తి చేస్తామని చెప్పింది.

సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్లను అందించేందుకు చూస్తున్నట్లు ఫైజర్ ఇంక్ చైర్మన్ ఆల్బర్ట్ బోర్ల తెలిపారు. వ్యాక్సిన్ భద్రత, ప్రభావాలపై తమకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి కోసం అమెరికాలోనే కాకుండా  యూరోపియన్, యూకే ఔషధ నియంత్రణ సంస్థలకు కూడా తాము దరఖాస్తు చేయనున్నట్లు వివరించారు.

అంతేగాక, ఇతర దేశాలలోనూ దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఫైజర్ తయారీ వ్యాక్సిన్ ను అతి శీలత వాతావరణంలో నిల్వ చేస్తూ ప్రజలకు అందించాల్సి ఉండడంతో అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ ను సిద్ధం చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.