cyberabad cyber crime: మేల్ ఎస్కార్ట్’ ఉద్యోగం పేరుతో బురిడీ.. రూ. 13.82 లక్షలు వదిలించుకున్న హైదరాబాద్ వాసి

  • నిందితులు సిలిగురిలో ఉన్నట్టు గుర్తించిన హైదరాబాద్ పోలీసులు
  • అక్కడికెళ్లి పది రోజులు మకాం వేసి నిందితులకు బేడీలు
  • పరారీలో ప్రధాన నిందితులు
cyberabad cyber crime police arrested three culprits in siliguri

ఓ డేటింగ్ సైట్‌లో ‘మేల్ ఎస్కార్ట్’ ఉద్యోగాల పేరుతో ఉన్న ప్రకటన చూసి ఆశ్రయించిన హైదరాబాద్‌కు చెందిన ఓ నిరుద్యోగి రూ. 13.82 లక్షల చేతిచమురు వదిలించుకున్నాడు. ఆ తర్వాత కూడా మరో రూ. 1.5 లక్షలు చెల్లించాలంటూ ఒత్తిడి రావడంతో చేసేది లేక సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి వెళ్లి, అక్కడ పది రోజులు మకాం వేసి ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్ తీసుకొచ్చారు.

పోలీసుల కథనం ప్రకారం.. సోషల్ మీడియాలో ‘మేల్ ఎస్కార్ట్’ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రకటన చూసిన ఓ యువకుడు ‘స్పైసీఫ్రెండ్‌షిప్.కామ్’ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యాడు. అతడు అందులో నమోదు చేసిన వివరాల ఆధారంగా మహిళలు ఫోన్ చేసి వీఐపీ మెంబర్‌షిప్ ఇస్తామని చెప్పి బాధితుడి నుంచి రూ. 13.82 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత కూడా రూ. 1.5 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు గత నెల 18న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల ఫోన్ సిగ్నల్స్, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా సిలిగురిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి పది రోజులు మకాం వేశారు. నిందితుల కాల్ సెంటర్‌పై దాడిచేసి బిజయ్ కుమార్ షా, బినోద్ కుమార్ షా, మహ్మద్ నూర్ ఆలం అన్సారీలను అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరు పరిచిన అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన సంతూదాస్, అమిత్ పాల్ అలియాస్ అమిత్ శర్మ, సుషాంక్ కుమార్ షా పరారీలో ఉన్నారని, టెలికాలర్స్ దీపా హాల్దార్, శిఖా హాల్దార్‌కు నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News