కమెడియన్ కునాల్ కమ్రాపై చర్యలకు అనుమతి ఇచ్చిన ఏజీ

21-11-2020 Sat 09:06
  • అర్నాబ్ గోస్వామికి బెయిలు మంజూరు చేయడంపై వివాదాస్పద ట్వీట్
  • సుప్రీంకోర్టుకు కాషాయ రంగు, దానిపై బీజేపీ జెండాతో ఫొటో
  • అతడి ట్వీట్లు అసభ్యకరంగా, అసహ్యంగా ఉన్నాయన్న ఏజీ
AG grants consent for contempt proceedings against Kunal Kamra

సుప్రీంకోర్టుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అనుమతి ఇచ్చారు. కునాల్ కమ్రా ఇటీవల పలు వివాదాస్పద ట్వీట్లు చేశాడు. ఓ కేసులో అరెస్ట్ అయిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంపైనా వివాదాస్పద ట్వీట్ చేశాడు.

 కాషాయం రంగులో ఉన్న సుప్రీంకోర్టుతోపాటు, దానిపై ఉండాల్సిన త్రివర్ణ పతాకం స్థానంలో బీజేపీ జెండా ఉన్న ఫొటోను పోస్టు చేశాడు. అలాగే, విమానంలో ప్రయాణిస్తూ రెండు వేళ్లు చూపిస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.  ‘‘ఈ రెండు వేళ్లలో ఒకటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అర్వింద్ బాబ్డే. మధ్యవేలు..’’ అంటూ వివాదాస్పద క్యాప్షన్ తగిలించాడు.

ఆయన ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీనిపై ఏజీ వేణుగోపాల్ చర్యలకు పూనుకోగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్ వేణుగోపాల్‌కు బహిరంగ లేఖ రాసిన కునాల్ దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘‘లాయర్లు లేరు, క్షమాపణ చెప్పేది లేదు, జరిమానా కట్టేది లేదు. నా సమయాన్ని అనవసరంగా వృథా చేసుకోను’’ అని పేర్కొన్నాడు. దీంతో కునాల్‌పై చర్యలు తీసుకునేందుకు ఏజీ అనుమతి ఇచ్చారు.

ఆయన ట్వీట్ చాలా అసభ్యకరంగా, అసహ్యంగా ఉందని ఏజీ పేర్కొంటూ చర్యలకు అనుమతి ఇచ్చారు. వాక్ స్వాతంత్య్రం పేరుతో సుప్రీంకోర్టును, దాని న్యాయమూర్తులను కూడా ధైర్యంగా విమర్శించవచ్చని చాలామంది భావిస్తున్నారని, కానీ, వాక్ స్వాతంత్య్రం రాజ్యాంగానికి లోబడి ఉంటుందని ఏజీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.