Nizamabad District: బెట్టింగులో దొరికిన నిందితుడికి స్టేషన్ బెయిల్.. రూ. 5 లక్షలు డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిన సీఐ

  • నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఘటన
  • తొలి విడతగా రూ. 1,39,500  తీసుకుని విడుదల
  • బాధితుడి ఫిర్యాదుతో సీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు
Case against Kamareddy CI for taking bribe

ఓ నిందితుడికి స్టేషన్ బెయిలు ఇచ్చేందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన ఓ సీఐ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన బత్తుల సుధాకర్ ఐపీఎల్ బెట్టింగు కేసులో ఈ నెల 8న అరెస్టయ్యాడు. అతడికి స్టేషన్ బెయిలు ఇప్పిస్తానని చెప్పిన పట్టణ సీఐ జగదీశ్ రూ. 5 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా మొదటి విడత కింద రూ. 1,39,500 తీసుకుని అదే రోజున నిందితుడు సుధాకర్‌ను విడిచిపెట్టాడు.

డీల్‌లో భాగంగా ఇవ్వాల్సిన మిగతా సొమ్ము కోసం సుధాకర్‌ను సీఐ వేధించడం మొదలుపెట్టాడు. సీఐ జగదీశ్ వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేని సుధాకర్ ఈ నెల 19న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిన్న తెల్లవారుజామున కామారెడ్డిలోని సీఐ ఇంటికి చేరుకుని సోదాలు చేశారు. రాత్రి వరకు జరిగిన ఈ సోదాల్లో సీఐ అవినీతికి సంబంధించి పలు ఆధారాలు లభించాయని, జగదీశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.

More Telugu News