VK Sasikala: శశికళ ముందస్తు విడుదల ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక హోం మంత్రి

  • సత్ప్రవర్తన కారణంగా వచ్చే ఏడాది జనవరి 27న శశికళ విడుదల
  • జరిమానా రూ.10.10 కోట్లు చెల్లించడంతో ఏ క్షణమైనా విడుదలవుతారని ప్రచారం
  • అలాంటిదేమీ లేదన్న కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై
Sasikalas release from jail will be as per court orders

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ముందస్తు విడుదల ఆశలపై కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై నీళ్లు చల్లారు. శశికళ ముందస్తుగా జైలు నుంచి విడుదల కావడం అసాధ్యమని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పూర్తి శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో మరో ఒకటి రెండు రోజుల్లో ఆమె బయటకు వస్తారని ఎదురుచూస్తున్న శశికళ బంధువులు, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

నిజానికి శశికళ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉండగా, సత్ప్రవర్తన కారణంగా జనవరి 27న విడుదల చేయనున్నట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. జైలులో ఉన్న శశికళ నాలుగేళ్ల కాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే, అది కూడా ఆమె భర్త మృతి చెందినప్పుడు మాత్రమే పెరోల్‌పై బయటకు వచ్చారని, ఆ తర్వాత ఎప్పుడూ పెరోల్ కోరలేదని ఆమె తరపు న్యాయవాది రాజా సెందూర్ పాండియన్ తెలిపారు. దీనికి తోడు ప్రభుత్వ సెలవులు కూడా కలుపుకుంటే, ముందుగానే విడుదలవుతారని ఆమె న్యాయవాది చెబుతూవున్నారు.

ఇటీవల కోర్టుకు చెల్లించాల్సిన రూ.10.10 కోట్ల జరిమానాను కూడా చెల్లించడంతో శశికళ ఏ క్షణంలోనైనా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. అయితే, మంత్రి బసవరాజ్ మాత్రం శశికళ ఇప్పటికిప్పుడు విడుదలయ్యే అవకాశం లేదని, పూర్తి శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పడం గమనార్హం. ఆమె ఎప్పుడు విడుదల కావాలన్నది జైలు నిబంధనలే చెబుతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది జనవరి 27 కంటే ముందు ఆమె జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేనట్టే.

More Telugu News