సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్ పై ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

20-11-2020 Fri 21:15
  • సీఎం గురించి వెకిలిగా, చిల్లరగా మాట్లాడారు
  • మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
  • సంజయ్ ను అరెస్ట్ చేసి ప్రచారంలో పాల్గొనకుండా చేయాలి
TRS complains on Bandi Sanjay for his comments on KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్ఈసీ పార్థసారథికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ను దేశద్రోహి అంటూ మీడియా సమావేశంలో సంజయ్ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, నాయకులను అవమానపరిచేలా మాట్లాడుతున్న సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు. సీఎం స్థాయి వ్యక్తిపై దారుణ వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టాలని విన్నవించారు.

ఈ సందర్భంగా మీడియాతో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గురించి వెకిలిగా, చిల్లరగా మాట్లాడటం బండి సంజయ్ కే చెల్లిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలని కోరారు.