సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లిన బండి సంజయ్!

20-11-2020 Fri 20:02
  • ఇతర పార్టీల నేతలకు బీజేపీ ఆహ్వానాలు
  • సర్వే ఇంటికి వెళ్లి ఆహ్వానించిన బండి సంజయ్
  • పార్టీ మారేందుకు సర్వే సిద్ధమైనట్టు సమాచారం
Bandi Sanjay invites Sarvey Sathyanarayana to join BJP

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు దూకుడు పెంచారు. దుబ్బాక విజయం ఇచ్చిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీని బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో బీజేపీ నాయకులు చర్చలు జరిపారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఇంటికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ ఎంపీ జి.వివేక్ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణకు బండి సంజయ్ పుష్పగుచ్ఛం అందించగా... బండికి సర్వే శాలువా కప్పారు. అందరూ కలిసి ఫొటోలు దిగారు. బీజేపీలో చేరాలని సర్వేను బండి సంజయ్ కోరారు. వీరి మధ్య కాసేపు చర్చలు జరిగాయి. దీంతో, బీజేపీలో చేరేందుకు సర్వే సత్యనారాయణ రెడీ అయిపోయినట్టు సమాచారం. ఇటీవలే విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. త్వరలోనే ఆమె బీజేపీలో చేరనున్నారు.