బెంగళూరు ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే సత్యప్రభకు నివాళులు అర్పించిన రామ్ చరణ్

20-11-2020 Fri 18:22
  • కరోనా ప్రభావంతో డీకే సత్యప్రభ మృతి
  • బెంగళూరు వైదేహి ఆసుపత్రికి విచ్చేసిన రామ్ చరణ్
  • చరణ్ ను చూసేందుకు పోటెత్తిన జనం
Ram Charan paid tributes to DK Sathyaprabha

టీడీపీ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కరోనా ప్రభావంతో కన్నుమూయడం తెలిసిందే. ఆమె అంత్యక్రియలు బెంగళూరులో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో సత్యప్రభ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రామ్ చరణ్ రాకతో ఆసుపత్రి వద్ద కోలాహలం నెలకొంది. అభిమానులే కాకుండా, అక్కడున్నవారు కూడా చరణ్ ను చూసేందుకు ఎగబడ్డారు. సత్యప్రభ మృతి పట్ల రామ్ చరణ్ విచారం వ్యక్తం చేశారు.

సత్యప్రభ ఇటీవలే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ రాజకీయవేత్త, టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు అర్ధాంగి. ఆదికేశవులునాయుడు చనిపోయిన అనంతరం ఆమె రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున విజయం సాధించారు. కొన్నిరోజుల కిందట కరోనా బారినపడిన సత్యప్రభ బెంగళూరులో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.