దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీనే 'లవ్ జిహాద్' అనే పదాన్ని సృష్టించింది: అశోక్ గెహ్లాట్

20-11-2020 Fri 17:45
  • లవ్ జిహాద్ పై చట్టాలు తెస్తామన్న బీజేపీ రాష్ట్రాలు
  • మత సామరస్యం దెబ్బతీసే కుట్ర అంటూ గెహ్లాట్ వ్యాఖ్యలు
  • దీటుగా బదులిచ్చిన కేంద్ర మంత్రి షెకావత్
Ashok Gehlot says BJP created Love Jihad word to disturb communal harmony

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీపై ధ్వజమెత్తారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీనే 'లవ్ జిహాద్' అనే పదాన్ని సృష్టించిందని తెలిపారు. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. లవ్ జిహాద్ పై కఠిన చట్టాలు తెస్తామంటూ బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవర్ని పెళ్లి చేసుకోవాలనేది ఓ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని ఆయన స్పష్టం చేశారు.

ఈ స్వాతంత్ర్యాన్ని నిర్మూలించేందుకు చట్టాలను తీసుకురావడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ తరహా చట్టాలు ఏ న్యాయస్థానంలోనూ నిలబడవని అభిప్రాయపడ్డారు. ప్రేమలో జిహాద్ కు స్థానం ఉండదని, చూస్తుంటే ఇది మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నంగానే కనిపిస్తోందని పేర్కొన్నారు. కాగా, రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బదులిచ్చారు.

"డియర్ అశోక్ జీ, లవ్ జిహాద్ అనేది ఓ వల. వేలమంది యువతులు ఇది పెళ్లి అని నమ్ముతున్నారు. కానీ అది పెళ్లి ఎంతమాత్రం కాదని తర్వాత తెలుసుకుంటున్నారు. పెళ్లి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం అంటున్నారు, మరి పెళ్లి చేసుకుంటున్న మహిళలు వారి పూర్వ పేరును, మతాన్ని ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? ఇక అసలు విషయానికొస్తే, అశోక్ జీ... పదాలు సృష్టించడం, అల్లర్లు రేకెత్తించడం కాంగ్రెస్ కే చెల్లుతుంది. బీజేపీ సర్వతోముఖాభివృద్ధినే నమ్ముతుంది. అందుకే మన మహిళలు ఎలాంటి అన్యాయాలకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం" అని ఘాటుగా స్పందించారు.