'ఢీ' సినిమాకి సీక్వెల్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు!

20-11-2020 Fri 17:24
  • శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'ఢీ'
  • మంచు విష్ణు కెరీర్లో బిగ్ హిట్
  • 'ఢీ' కన్నా బెటర్ ఏముందన్న విష్ణు  
  • 23న ఉత్తేజకరమైన అప్ డేట్  
Sequel on cards for Manchu Vishnus Dhee movie

ఒక్కొక్కళ్ల కెరీర్లో ఒక్కో సినిమా అన్ని రకాలుగానూ మంచి సినిమాగా నిలిచిపోతుంది. హీరో మంచు విష్ణు కెరీర్లో ఢీ' సినిమా కూడా అలాంటిదే. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకోవడమే కాకుండా, బాక్సాఫీసు వద్ద కూడా ఘన విజయాన్ని సాధించింది.

పదమూడేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తుందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా హీరో మంచు విష్ణు దీనిపై స్పందిస్తూ చిన్న హింట్ ఇచ్చాడు.

'వేలాది సినీ ప్రియులకు ఇష్టమైన సినిమాలలో ఢీ ఒకటి. ఆ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులకి సిబ్బందికి ఇదొక కొత్తదనాన్ని ఇచ్చింది. ఆ సమయంలో కొత్తరకం సినిమాలకు ఇదొక ఊపునిచ్చింది. అయినా, ఢీ కన్నా బెటర్ మరేముంది?' అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.

అంతేకాకుండా, ఈ నెల 23న ఓ ఉత్తేజకరమైన అప్ డేట్ ను ఇస్తున్నానని విష్ణు పేర్కొన్నాడు. దీనిని బట్టి చూస్తే 'ఢీ' సినిమా సీక్వెల్ కి రంగం సిద్ధమైందన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి, ఆ రోజు ఈ మంచు వారి హీరో ఏం చెబుతాడో చూద్దాం!