విజయసాయి ఆ లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలి: టీడీపీ నేత పల్లా

20-11-2020 Fri 17:04
  • విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమాన సేవలు ఆపేయాలని విజయసాయి లేఖ
  • విశాఖ అభివృద్దికి వ్యతిరేకంగా విజయసాయి తీరు ఉందన్న పల్లా
  • లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్
Palla Srinivas Rao demands Vijayasai Reddy to withdraw his letter on Vizag Airport

విశాఖ ఎయిర్ పోర్టు నేవీకి చెందినదని.... ఆ విమానాశ్రయంలో 30 ఏళ్ల పాటు పౌర విమానయాన కార్యకలాపాలను నిలిపివేయాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిపై టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు.

అనేక పోరాటాల తర్వాత విశాఖ ప్రజలు ఎయిర్ పోర్టును సాధించుకున్నారని పల్లా అన్నారు. విశాఖపట్నం అభివృద్దికి వ్యతిరేకంగా విజయసాయి తీరు ఉందని మండిపడ్డారు. కేంద్రానికి రాసిన లేఖను విజయసాయి తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భోగాపురం విమానాశ్రయం ఇంకా ప్రారంభమే కాలేదని... అప్పుడే విజయసాయి ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు.

రియలెస్టేట్ వ్యాపారాల కోసమే విజయసాయి లేఖను రాశారని ఆరోపించారు. విజయసాయిపై జనసేన నేత బలిశెట్టి సత్యనారాయణ కూడా మండిపడ్డారు. ఎవర్ని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు.