అతి చిన్న గ్రామంలో ఒక్కడికి తప్ప అందరికీ కరోనా పాజిటివ్

20-11-2020 Fri 16:54
  • హిమాచల్ ప్రదేశ్ లోని తొరాంగ్ గ్రామ జనాభా 42 మంది
  • 41 మందికి కరోనా పాజిటివ్
  • ఇటీవల ఓ మత కార్యక్రమం కోసం గుమికూడిన గ్రామస్తులు 
Small village gets infected by corona except one person

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలు దాటడం తెలిసిందే. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కరోనా వ్యాప్తి ప్రబలంగా సాగుతోంది. ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ లోనూ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా, ఇక్కడి లాహౌల్-స్పితి వ్యాలీ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ జిల్లాలోని తొరాంగ్ అనే కుగ్రామంలో ఒక్కరికి తప్ప అందరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

తొరాంగ్ గ్రామ జనాభా 42 మంది కాగా,  52 ఏళ్ల భూషణ్ ఠాకూర్ అనే వ్యక్తికి మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది. మిగతా అందరూ కరోనా బారినపడ్డారు. ఈ గ్రామం మనాలి-లేహ్ రహదారిపై ఉంది. గ్రామంలో కరోనా ప్రబలడంతో టూరిస్టులకు ఈ ప్రాంతంలో ప్రవేశాలు నిలిపివేశారు. ఇక, నెగెటివ్ వచ్చిన భూషణ్ ఠాకూర్ కుటుంబంలోని ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. కొన్నిరోజుల కిందట జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో గ్రామస్తులందరూ ఒక్కచోట గుమికూడడంతో కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు.