ధోనీకి అత్యంత సన్నిహితురాలిని నేను మాత్రమే: సాక్షి

20-11-2020 Fri 16:22
  • నాకు పొడవాటి జుట్టు ఇష్టం ఉండదు
  • ధోనీని బాధించగలిగే వ్యక్తిని నేను మాత్రమే
  • జీవా తన తండ్రి మాటే వింటుంది
Sakshi Singh Dhoni On The Only Person Who Can Upset MS Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి నిన్న 32వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు.

తనకు పొడవాటి జుట్టు ఉన్నవాళ్లంటే ఇష్టం ఉండదని సాక్షి అన్నారు. కెరీర్ బిగినింగ్ లో పొడవాటి జుట్టులో ఉన్న ధోనీని తాను చూసి ఉన్నట్టైతే అతన్ని ఇష్టపడేదాన్ని కాదని చెప్పారు. అసలు చూడకపోయేదాన్నని అన్నారు. అప్పట్లో తాను చూడకపోవడం వల్లే ఆ తర్వాత ధోనీని ఇష్టపడగలిగానని చెప్పారు.

ధోనీని బాధించగలిగే ఏకైక వ్యక్తిని తానేనని సాక్షి చెప్పారు. ధోనీని కూల్ హెడ్ నుంచి హాట్ హెడ్ కి మార్చగల వ్యక్తిని తానేనని అన్నారు. ధోనీకి అత్యంత సన్నిహితురాలిని తానేనని... అందుకే ధోనీని తాను మాత్రమే కోపానికి గురి చేయగలనని చెప్పారు. ధోనీ ప్రతి విషయంలో చాలా ప్రశాంతంగా ఉంటాడని అన్నారు.

తమ కూతురు జీవా తన తండ్రి మాటే వింటుందని చెప్పారు. తాను కానీ, తన అత్తకానీ జీవాను తినమని అడిగితే పట్టించుకోదని... అదే ధోనీ ఒకసారి చెప్పినా వెంటనే తింటుందని అన్నారు. ఇంట్లో తాము క్రికెట్ గురించి ఎప్పుడూ మాట్లాడుకోమని చెప్పారు. తన భర్త ప్రొఫెషనల్ అని, క్రికెట్ అనేది ఆయన ప్రొఫెషన్ అని, అందుకే తాను కలగజేసుకోనని అన్నారు.