జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సహకరించేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించారు: కిషన్ రెడ్డి

20-11-2020 Fri 15:49
  • జనసేన, బీజేపీ అగ్రనేతల సమావేశం
  • పవన్ సహకారం కోరామన్న కిషన్ రెడ్డి
  • బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని పవన్ వెల్లడి
Kishan Reddy speaks about their meeting with Pawan Kalyan

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ అన్ని వనరులు సమీకరించుకుంటోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ సీనియర్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశం కావడం తెలిసిందే. జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ నివాసంలో జరిగిన ఈ కీలక భేటీ కొద్దిసేపటి కిందట  ముగిసింది.

ఈ సమావేశం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రావాలని జనసేనను కోరామని తెలిపారు. బీజేపీ విజయానికి పూర్తిగా సహకరిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారని వివరించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది తమతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. సమావేశంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు.