చంద్రబాబును దింపేసి నిమ్మగడ్డకు పగ్గాలిచ్చేస్తారేమో: విజయసాయిరెడ్డి

20-11-2020 Fri 15:36
  • నిమ్మగడ్డ టీడీపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు
  • టీడీపీ నేతలు చంద్రబాబు కంటే నిమ్మగడ్డనే ఎక్కువ నమ్ముతున్నారు
  • విశాఖ ఎయిర్ పోర్టు నేవీకి చెందినది
TDP leaders are believing Nimmagadda more than Chandrababu says Vijayasai Reddy

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేశ్ టీడీపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాదులోని హోటల్ లో టీడీపీ వ్యక్తులతో నిమ్మగడ్డ మీటింగ్ పెట్టారని విమర్శించారు.

కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలను నిర్వహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటున్నారని అన్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు కంటే నిమ్మగడ్డనే ఎక్కువ నమ్ముతున్నారని చెప్పారు. నిమ్మగడ్డను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేస్తారేమోనని అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబును దింపేసి నిమ్మగడ్డకు పార్టీ పగ్గాలను అప్పగిస్తారేమోనని ఎద్దేవా చేశారు.

విశాఖపట్నం ఎయిర్ పోర్టు ఇండియన్ నేవీకి చెందినదని విజయసాయి అన్నారు. ఇది కేంద్ర విమానయానశాఖకు చెందినది కాదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైయస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. పోలవరం వద్ద వైయస్ విగ్రహ ఏర్పాటును టీడీపీ నేతలు సహించలేకపోతున్నారని చెప్పారు.