హాట్ కేకుల్లా అమ్ముడైన టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ల టికెట్లు

20-11-2020 Fri 13:55
  • నవంబరు 27 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లు
  • 5 మ్యాచ్ లకు టికెట్లు మొత్తం అమ్మకం
  • ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్ కు అనుమతి
Team India tour in Australia tickets sold out

సుదీర్ఘ పర్యటన కోసం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఆసీస్ గడ్డపై భారత జట్టు పర్యటన షురూ కానుంది. మొదట 3 వన్డేలు ఆడనున్న టీమిండియా తర్వాత 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తలపడనుంది. అది ముగిసిన అనంతరం డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ జరుగుతుంది. కాగా, ఈ రెండు జట్ల పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ల టికెట్లు నేడు అమ్మకానికి ఉంచగా తొలిరోజే అదిరిపోయే స్పందన వచ్చింది.

మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల టికెట్లను విక్రయానికి పెట్టగా, 5 మ్యాచ్ ల టికెట్లు తొలిరోజే అమ్ముడయ్యాయి. అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేవలం తొలి వన్డేకు సంబంధించి 2 వేల టికెట్లు మాత్రమే ప్రస్తుతం మిగిలున్నాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్ నే అనుమతిస్తున్నారు. దాంతో టికెట్ల సంఖ్యను కూడా తగ్గించారు.