సీఎం హోదాలో ఉండి తప్పుడు ప్రచారాలు చేస్తావా? సవాల్ విసిరినా రాలేకపోయావు: చార్మినార్ వద్ద కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

20-11-2020 Fri 13:06
  • ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సంతకాన్నే ఫోర్జరీ చేశారంటే మామూలు విషయం కాదు
  • నా సవాల్ కు కేసీఆర్ స్పందిస్తారని అనుకున్నా
  • ఈ ముఖ్యమంత్రి ఒక దగాకోరు, అబద్ధాలకోరు
  • దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ కు సవాల్ విసిరాను
  • మత రాజకీయాలకు పాల్పడుతున్నది కేసీఆరే
KCR is making false propaganda says Bandi Sanjay

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ బీజేపీపై, తనపై అసత్య ఆరోపణలు చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. వరద సాయాన్ని ఆపేయాలంటూ ఎన్నికల సంఘానికి  తాను లేఖ రాసినట్టు తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.

ఆ ఆరోపణలపై తాను వెంటనే స్పందించానని... తాను లేఖ రాయలేదని, ఆ సంతకం తాను చేసింది కాదని తాను చెప్పానని అన్నారు. తప్పుడు ప్రచారాలతో జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవాలని కేసీఆర్, కేటీఆర్ కుట్రలకు  తెరలేపారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ఎన్నికలకు వెళ్లాలి కానీ, ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఎన్నికలకు వెళ్లడం దారుణమని అన్నారు. ఈ కారణాల వల్లే తాను ముఖ్యమంత్రికి సవాల్ విసిరానని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడి సంతకాన్నే ఫోర్జరీ చేశారంటే... ఇది చిన్న విషయం కాదని బండి సంజయ్ అన్నారు. అందుకే చార్మినార్ అమ్మవారి ఆలయానికి వచ్చి లేఖపై, సంతకంపై నిజాలు మాట్లాడాలని కేసీఆర్ ను ఛాలెంజ్ చేశానని చెప్పారు. కేసీఆర్ వస్తారని తాను భావించానని, కానీ ఆయన రాలేదని ఎద్దేవా చేశారు. తాను వాస్తవాలను మాట్లాడిన తర్వాతైనా కేసీఆర్ స్పందిస్తే బాగుండేదని... కానీ  ఆయన మౌనంగా ఉన్నారని అన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ కు తాను సవాల్ విసిరానని... కానీ ఆయన అప్పుడు స్పందించలేదని, ఇప్పుడూ స్పందించలేదని ఎద్దేవా చేశారు.

ఈ ముఖ్యమంత్రి ఒక అబద్ధాలకోరు అనే విషయాన్ని ప్రజలందరికీ చెపుతున్నానని సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దగాకోరు మాటలు చెపుతూ, జనాలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. భాగ్యనగరంలో బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని... బీజేపీ అనేది మాట తప్పే పార్టీ కాదని అన్నారు.

అన్ని విషయాలపై మాట్లాడే ముఖ్యమంత్రి... ఈ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, మతం పేరుతో రెచ్చగొడుతోందని కేసీఆర్ అంటున్నారని... నిజానికి మతాన్ని వాడుకుంటున్నది కేసీఆరే అని అన్నారు. ఎంఐఎంతో చేతులు కలిపి మత రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.

హైదరాబాద్ విశ్వనగరమని, నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని... ఆయన చేసిందేమిటో కళ్ల ముందు కనపడుతోందని సంజయ్ చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజలు చాలా తెలివైనవారని, కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెపుతారని అన్నారు. వరద సాయంపై రాసిన లేఖ తనది కాదని, సంతకం తనది కాదని... అందుకే తాను నమ్మే అమ్మవారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. కేసీఆర్ కోసం మరికొంత సమయం వేచి చూస్తామని... ఆయన వస్తారో, రారో చూస్తామని తెలిపారు. అసలు సీఎంగా ఉన్న ఇన్నేళ్లలో నీవు ఏమేం చేశావో అనేదైనా ఇక్కడకు వచ్చి చెప్పాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు.