భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన బండి సంజయ్..పెరిగిన ఉత్కంఠ.. పటిష్ఠ బందోబస్తు

20-11-2020 Fri 12:07
  • వరద సహాయం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  •  బైక్ ర్యాలీగా భాగ్యలక్ష్మీ ఆలయానికి పయనం 
  • భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలని చాలెంజ్
  • ముఖ్యమంత్రి వస్తున్నారా? లేదా? అని బండి సంజయ్ ప్రశ్న
bandi sanjay to reach charminar

వరద సహాయం విషయంలో తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంపై నిజాలు మాట్లాడుకోవడానికి, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయడానికి రావాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో  చార్మినార్‌ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీజేపీ కార్యాలయం నుంచి చార్మినార్ వరకు బైక్ ర్యాలీగా సంజయ్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్దకు వస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను దైవ సాక్షిగా ప్రజలకు వివరించేందుకు భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరాను. ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి వస్తున్నారా? లేదా?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

 ఎట్టిప‌రిస్థితుల్లోనూ  భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్దకు వస్తామని బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.