Sahara: జైల్లోకి వెళ్లకుండా ఉండాలంటే సుబ్రతా రాయ్ రూ. 62,600 కోట్లు కట్టాల్సిందే: సెబీ

  • ప్రస్తుతం పెరోల్ పై బయటున్న సుబ్రతా రాయ్
  • పెరోల్ ను రద్దు చేయాలంటూ సెబీ పిటిషన్
  • ఈ డిమాండ్ అర్థరహితమన్న సహారా గ్రూప్
Subrato Roy Must Pay 62 thousand Crores demanded SEBI

ప్రస్తుతం పెరోల్ పై బయటున్న సహారా గ్రూప్ సంస్థల అధినేత సుబ్రతా రాయ్, తిరిగి జైల్లోకి వెళ్లకుండా ఉండాలంటే, రూ. 62,600 కోట్లు చెల్లించాల్సిందేనని మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసిన సెబీ, ఆయన తక్షణం డబ్బు కట్టకుంటే, పెరోల్ ను రద్దు చేయాలని కోరింది. సహారా ఇండియా పరివార్ గ్రూప్ లోని రెండు కంపెనీలు, వాటి చీఫ్ సుబ్రతారాయ్ వడ్డీతో కలిపి రూ. 62 వేల కోట్లకు పైగా చెల్లించాలని సెబీ కోరింది.

కాగా, ఎనిమిది సంవత్సరాల నాడు రూ.25,700 కోట్లుగా ఉన్న సుబ్రతా రాయ్ బకాయిలు, ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. సహారా గ్రూప్ కంపెనీలు చట్ట విరుద్ధంగా 3.5 బిలియన్ డాలర్లను సమీకరించిందని, ఈ ప్రక్రియలో సెక్యూరిటీస్ చట్టాలను కూడా ఉల్లంఘించారని సుప్రీంకోర్టు 2012లోనే తేల్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నుంచి ఈ డబ్బును సేకరించారని, సెబీ సైతం వీరందరినీ గుర్తించలేకపోయిందని, వారికి సహారా సంస్థలు తిరిగి డబ్బు చెల్లించలేదని, ఆ కారణంగానే ఆయన్ను జైలుకు పంపాల్సి వచ్చిందని సెబీ ప్రస్తావించింది.

కాగా, సెబీ చేసిన ఈ డిమాండ్ అర్థరహితమని సహారా గ్రూప్ ఓ ఈమెయిల్ స్పందనలో పేర్కొంది. సెబీ ఏకంగా 15 శాతం వడ్డీని కలిపిందని, తమ ఇన్వెస్టర్లలో చాలా మందికి ఇప్పటికే తిరిగి డబ్బును చెల్లించేశామని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ సుబ్రతా రాయ్ రూ. 15 కోట్లను కోర్టుకు జమ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందన్న విషయాన్ని కోర్టు ఇంకా నిర్ణయించలేదు.

More Telugu News