GHMC Elections: నాలుగు ఇడ్లీలకు రూ. 20, ఆలూ సమోసాకు రూ. 10.. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ధరలను నిర్ణయించిన జీహెచ్ఎంసీ

  • ధరల జాబితాను విడుదల చేసిన జీహెచ్ఎంసీ
  • ఇండికా కారుకు రోజుకు డ్రైవరు బత్తాతో కలిపి రూ. 1200
  • కుర్చీకి ఏడు రూపాయలు
  • ఎంత ఖర్చు చేసినా రూ. 5 లక్షల లోపే
GHMC Released list of candidates expenditure

గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులు చేసే ఖర్చు ఎలా ఉండాలన్నదానిపై జీహెచ్ఎంసీ నిన్న ఓ పట్టికను విడుదల చేసింది. దీని ఆధారంగానే అభ్యర్థుల ఖర్చును నిర్ణయించనున్నారు. అభ్యర్థులు ఇష్టానుసారం ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో చేసే ప్రతి ఖర్చుకు ఓ ధరను నిర్ణయించారు.

జీహెచ్ఎంసీ అధికారులు విడుదల చేసిన ధరల జాబితా ప్రకారం.. అభ్యర్థి వేసుకునే కండువాకు రూ. 20, మాస్కుకు రూ. 20 చొప్పున లెక్క కడతారు. అలాగే, ప్రచారంలో భాగంగా అల్పాహారం తీసుకుంటే నాలుగు  ఇడ్లీలకు రూ. 20, నాలుగు వడలకు రూ. 20, ఆలూ సమోసా తింటే రూ. 10, ఇరానీ సమోసాకు రూ. 3 చొప్పున లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థుల లెక్కల్లోకి ఎక్కుతుంది.

అలాగే, ప్రచారంలో ఉపయోగించే టాటా ఇండికా కారుకు రోజుకు డ్రైవరు బత్తాతో కలిపి రూ. 1200, 16 మంది వరకు కూర్చునే మాక్సీ క్యాబ్‌కు రూ. 1700, ఆటోకు రూ. 300, మినీ లారీకి రూ. 1700, బస్సుకు రూ. 3,900, ట్రాక్టరుకు రూ. 1400, మామూలు కుర్చీకి ఏడు రూపాయలు, టీ, కాఫీలకు రూ. 5 నుంచి రూ. 10, వాటర్ ప్యాకెట్‌కు రూపాయి, వాటర్ బాటిల్‌కు రూ. 20, 400 వాట్స్ లౌడ్ స్పీకర్లు రెండింటికి రూ. 3,850, ఐదుగురు కూర్చునే వేదిక నిర్మాణానికి రూ. 2,200, వస్త్రంతో చేసిన చిన్న జెండాకు రూ. 30, పెద్దదైతే రూ. 61గా ధరలను నిర్ణయించారు. ఇవన్నీ ఉపయోగించినా ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు రూ. 5 లక్షలకు మించకూడదు.

More Telugu News