Joe Biden: రీ కౌంటింగ్ తరువాత కూడా జార్జియాలో ట్రంప్ ఓటమి!

  • బైడెన్ దే విజయమన్న జార్జియా ఓటింగ్ సిస్టమ్స్ అధికారి
  • మిచిగన్ లో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్న ట్రంప్
  • మరో వారంలోనే బైడెన్ గెలిచినట్టు అధికారిక ప్రకటన
Trump Loss in Georgia after Re Counting

అమెరికాకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జార్జియా రాష్ట్రానికి సంబంధించి, రీకౌంటింగ్ జరుగగా, బైడెన్ గెలిచినట్టుగా తెలుస్తోంది. జార్జియాలో తనదే విజయమని, కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ట్రంప్ టీమ్, రీకౌంటింగ్ కు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఇక జార్జియా ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో మిచిగన్ విషయంలో ట్రంప్ టీమ్ కోర్టులో వేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకుంది.

జార్జియా ఓటింగ్ సిస్టమ్ అధికారి గాబ్రియేల్ స్టెర్లింగ్, రీకౌంటింగ్ తరువాత బైడెన్ అడ్వాంటేజ్ లో ఉన్నారని 'ఫాక్స్ న్యూస్' వార్తా సంస్థకు వెల్లడించారు. కౌంటింగ్ లో ఎటువంటి అవకతవకలూ జరగలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ అధికారులు వారి విధిని సక్రమంగానే నిర్వహించారు. అతి కొద్ది ఓట్లను మాత్రమే నాడు లెక్కించలేదు. ఆపై రీకౌంటింగ్ కూడా గొప్పగా జరిగిందని ఆయన అన్నారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా, బైడెన్ 306 ఓట్లను, ట్రంప్ 232 ఓట్లను సంపాదించారు. ఆపై చాలా రాష్ట్రాల్లో ట్రంప్ టీమ్ కోర్టులను ఆశ్రయించగా, పలు కేసులను న్యాయమూర్తులు కొట్టివేయడం జరిగింది. ఇక మిచిగన్ లో వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ న్యాయవాది రూడీ గియులానీ తెలియజేశారు. దీంతో బైడెన్ ఎన్నికైనట్టు అధికారిక ప్రకటన వారం రోజుల లోపే వెలువడవచ్చని తెలుస్తోంది.

More Telugu News