పంజాగుట్ట ఫ్లయ్ ఓవర్ పై 'డిస్కో నైట్'... వైరల్ వీడియో ఇదిగో!

20-11-2020 Fri 09:38
  • త్వరలో గ్రేటర్ ఎన్నికలు
  • అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వీధి దీపాలు
  • చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఉందంటున్న నెటిజన్లు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్న వేళ, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తూ, ఓ వీడియో వైరల్ అవుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట ఫ్లవ్ ఓవర్ పై వీధి దీపాలు వెలుగుతూ, ఆరిపోతూ సరిగ్గా పనిచేయట్లేదు. అయితే, ఈ వీధి దీపాలు డిస్కో లైట్ల వరుసను తలపించాయి. దీంతో ఓ ట్విట్టర్ యూజర్ దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా, వైరల్ అయింది.

"పంజాగుట్ట ఫ్లయ్ ఓవర్ పై డిస్కో నైట్. ఎన్నికల సందర్భంగా దీన్ని జీహెచ్ఎంసీ స్పాన్సర్ చేసింది" అంటూ శ్రీనివాస్ బెల్లం అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ను, జీహెచ్ఎంసీని ట్యాగ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో, తమ ప్రాంతాల్లో సైతం ఇదే విధమైన పరిస్థితి నెలకొని వుందంటూ ఎంతో మంది వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.