తొలి నవలతోనే బుకర్ ప్రైజ్ సాధించిన స్కాట్ ల్యాండ్ రచయిత!

20-11-2020 Fri 08:54
  • డగ్లస్ రాసిన తొలి నవల 'షుగ్గీ బియాన్'కు ప్రతిష్ఠాత్మక బహుమతి
  • తన కల నెరవేరిందన్న డగ్లస్
  • హృదయాలను హత్తుకునేలా నవలా రచన
Scotish Writer Gets 2020 Booker Prize

స్కాట్ ల్యాండ్ కు చెందిన రచయిత డగ్లస్ స్టువార్ట్, 2020 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ఫ్రైజ్ ను సాధించారు. డగ్లస్ రాసిన తొలి నవల 'షుగ్గీ బియాన్'కు ఈ గుర్తింపు లభించింది. 1980వ దశకంలో ఓ ఉద్యోగ బాధ్యతల్లోని కుటుంబం, వారి చిన్నారుల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో స్టువార్ట్ ఈ నవలను రాశారు. అవార్డు తనకు లభించిందని తెలిసిన తరువాత ఆయన స్పందిస్తూ, "నేను ఓ రచయితగా గుర్తింపు పొందాలని ఎన్నో కలలు కన్నాను. నా కోరిక నెరవేరింది. ఈ బహుమతి నా మొత్తం జీవితాన్నే మార్చి వేసింది" అని అన్నారు.

ప్రస్తుతం డగ్లస్ స్టువార్ట్ న్యూయార్క్ లో ఉంటున్నారు. బుకర్ ప్రైజ్ కు తుది పోరులో నిలిచిన డగ్లస్, వీడియో లింక్ ద్వారా ప్రైజ్ ఎనౌన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రిటన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆహూతులు భౌతిక దూరం పాటించి, మాస్క్ లు ధరించి కనిపించారు.

ఇక స్టువార్ట్ నవలలో తన స్వీయ అనుభవాలను కూడా జోడించారు. మద్యానికి బానిసైన తల్లి, ఆపై తన అలవాట్లతో అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోవడం, పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రేమను కోరుకుంటారు తదితరాలను ఎంతో భావోద్వేగాలతో మనసుకు హత్తుకునేలా రచించారు. తన జీవితంలో ఎన్నో బాధలను అనుభవించానని, ఈ పుస్తకం తన బాధల నుంచి విముక్తిని కలిగించిందని ఈ సందర్భంగా డగ్లస్ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ బహుమతిలో భాగంగా 66 వేల డాలర్లను డగ్లస్ అందుకోనున్నారు. దానికన్నా పెద్ద బహుమతి, అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు రావడమేనని ఈ సందర్భంగా డగ్లస్ వ్యాఖ్యానించారు.